Tuesday 16 April 2013

నాలోని నువ్వు !!

బుడి బుడి నడకల నుంచి పరుగులు తీసే వరకు నా వేలు పట్టుకుని నడిపించి ...
జీవితపు ప్రయాణం లో నేను వేసే ప్రతి అడుగుకి స్వేచ్చ ఇస్తూ ..
నేను వేసే అడుగు తప్పటడుగు అవ్వకుండా .. నా పాదాలు కందిపోకుండా ..
నా వెన్నంటే ఉండి ...

గెలుపు ఓటముల లోకం లో .. నా గెలుపులకి కేరింతలు కొడుతూ...
 నా ఓటములకి భుజం తడుతూ ..
ప్రతి క్షణం నన్ను ఉత్సాహ పరుస్తూ..
తనలో ఊపిరి గా  నన్ను నింపుకుని . ..నన్నే  తన జీవితం లా మార్చుకుని ..

తప్పటడుగులు వేసే వయసు నుంచి పరిపూర్ణ మహిళా గా నేను ఎదిగే వరకు నా ప్రేరణగా మారి..
దోస్తులతో జగడాలు అయినపుడు మా కటీఫ్ లను మళ్లీ  దోస్తీ కింద మారుస్తూ..తను కూడా ఒక దోస్త్ లా ఉంటూ ...


నేను కోపం తో చిరాకు పడినా తను మాత్రం పరాకు చూపించకుండా.. 
ముప్పై ఏళ్ళు వచ్చిన నన్ను మూడేళ్ళ పాపాయి లానే తన పొత్తిళ్ళలో జాగ్రత్త గా కాపాడుతూ.. 

నేను అల్లరి చేసేటప్పుడు నాతో తను కూడా చిన్న పిల్లలా మారి అల్లరి చేస్తూ
మారుతున్న యువతరం భావాలను తనలో ఇంకించుకుని ...
ఎప్పుడు సరి కొత్తగా కనిపిస్తూ నాకు మార్గదర్శి గా నిలిచిన నా బంగారు తల్లి ...

ఎప్పటికి నాతోనే ఉంటుందని అనుకుంటూ హాయిగా నిద్రపోయా .. కాని.. నా కల చెదిరింది !!
నాలోని కలలకి ఊపిరి పోసిన తేజం కల లాగా కరిగిపోతుందని నేను ఎన్నడు ఊహించలేదు !

ఇంకా ఎన్ని రోజులు చిన్న పిల్ల లాగానే ఉంటానో అని ..
నిదుర లేచి కల ప్రపంచం నుంచి బయటకు రావాలని అనుకున్నాడో ఏమో బహుశా
అందుకే .. ఇంత మంచి బంగారాన్ని ( రాణి ని ) తన దగ్గరకు రప్పించుకోవాలనే ఆరాటం లో
మనసు లేని ఆ దేవుడు నిన్ను తన దగ్గరకు స్పీడ్ పోస్ట్లో తీసుకెళ్ళిపోయాడు!

అమ్మా ... నువ్వు లేకుండా నేను ప్రయాణం ప్రారంభించి అక్షరాల 189 రోజులు ...!
నువ్వు లేని ఈ ప్రయాణం ఈ కొత్తదనం లేకుండా బోసి గా నవ్వుతుంది
నాలో ని చిలిపి తనం నువ్వు వదిలి వెళ్లి పోయిన శూన్యం లో కలిసి పోయింది ..

నువ్వు గుర్తుకు రాని రోజే లేదు నిన్ను మరిచే క్షణం రాదు
నువ్వు లేని ఈ లోకం లో నేను ఏంటో ? అని ప్రశ్న గా మారిన సందర్భాలు ఎన్నో !
కాని ... నువ్వు ఇంతేనా ?? అని నువ్వు నాకు ఎంతో ప్రేమగా పెట్టిన పేరు నన్ను వెక్కిరిస్తూ ఉంటుంది ..

అమ్మా ... నీలోని ఆలోచనలకు నేను రూపం అనేదానివి
దానిని నిజం చేయటానికి నన్ను నీ లా మలచుకుంటా !

నువ్వు నా కోసం వదిలేసి వెళ్లి పోయిన స్ఫూర్తి ..
మహిళా స్వాతంత్రం కోసం నువ్వు పడిన ఆవేదన ..
సమాజం కోసం నువ్వు పడిన వేతనా..
నీ ఆవేశం .. నీ ఆక్రోశం ..
నువ్వు ప్రేమించిన వాళ్ళ కోసం నువ్వు చూపించిన ఆదరణ ... ఆరాధనా !

అన్నీ.. ఇవన్నీ ... గుర్తుకు చేసుకుంటూ ..

అలుపెరగని కెరటం లా మళ్లీ   ఎగసి పడతా !

అచేతనం తో కాదు చైతన్యం నిండిన నయనాలతో మళ్లీ   ప్రపంచాన్ని కొత్తగా చూస్తా !

ఏమో .. నువ్వే నాలో మళ్లీ   జన్మిస్తావేమో !!

అందుకే .. నాలోని నీ కోసం నేను ఆశ గా ఎదురు చూస్తుంటా ..!

LOVE YOU AMMA <3 <3


 

Tuesday 13 December 2011

నువ్వు- నేను

చందమామ లేని ఆకాశం...
ఉరకలు వేయని జలపాతం.....

కాశ్మీరం లేని భారతం ......
ప్రేమ లేని జీవితం .....

"నువ్వు" లేని "నేను "...............
ఉన్నా  ....  బ్రతికే ఉన్నా ...........................................


"లేనట్టే " !!    

Wednesday 7 September 2011

హృదయం

కన్నీరా నీ విలువెంత ?
నా జీవితం లో నీ చోటెంత?
సంతోషం వచ్చినా దుఖం వచ్చినా
నేను ఉన్నాను అంటూ వస్తావు
నా బాధని అంతా ఆవిరిగా మార్చి
నా కన్నుల నుంచి పుడతావు ..

ఈ లోకం లోని కుళ్ళుని చూసి నా హృదయం శిల అయ్యింది
ఏ స్పందనలు లేని రాయిగా మారింది ...
ఇది చూసి నేను బ్రతికున్నా...లేను అన్నారు
బండ రాయని ముద్ర  వేసారూ...

అది తప్పని నిరూపించడానికి ఇక నువ్వే నాకు మిగిలావు..
నేను ఇంకా బ్రతికే ఉన్నాను అని చెప్పడానికి ,
నా గుండె లోతుల్లో  ఎక్కడో చిక్కుకున్న నువ్వు...
నా కంటి పాపల నుండి ఉబికి రా నేస్తమా !
మళ్ళి నాలో ఒక చైతన్యాన్ని తీసుకురా ఓ భంధమా !


వసంతం

ఏమని చెప్పను నా చెలికి
నీవు నాకెంత దూరమైనా
కారణాలు ఏవో తెలుసని చెప్పనా
ఎందుకంటే ...
పూల తోటలో ఎన్ని పూలున్నా
వాటి మధ్యలో వికసించని మొగ్గలు ఉంటాయి
నీ దూరం కూడా అలాంటిదే..
ప్రతి మొగ్గకి వసంతం వస్తుంది అలాగే మన ప్రేమకి కూడా  !

నేస్తం !

నేస్తం !
అలుపెరగని కెరటంలా,
అస్తమించని సూర్యుడిలా,
ఓటమి ఎరుగని వీరుడిలా,
ఎన్ని కష్టాలు  ఎదురైనా,
నీలోని చిరు నవ్వు చెదిరి పోకుండా..
ఆత్మ విశ్వాసం నలిగి పోకుండా.. 
గెలుపు కోసం పయనిస్తూ...
ప్రతి ఉషోదయాన్ని నూతనోత్సాహం తో ఆహ్వానించాలి !

జీవితం

గమ్యం లేని ప్రయాణం
చుక్కాని లేని నావ
ఎడతెగని ఆలోచనలు
ఇవి అన్ని .....
అసంపూర్ణమైన జీవితాన్ని గుర్తు చేస్తాయి.
కలిసి రాని  కాలం కసిగా చూసి నవ్వుతుంటే
మదిలోని భావాలూ సూదుల్లా గుచ్చుతుంటే
గమ్యం ఏమిటో తెలియక కలవార పడుతున్నా ! 
ఇదేనా  జీవితం అంటే ??
ఎటువంటి కొత్తదనం లేకుండా ఈ జీవితం బోసిగా నవ్వుతుంటే
తొలకరి జల్లు కోసం ఆశగా  ఎదురు చూస్తున్నా  !!
ఎంత ఎదురు చూసినా ఎడారే తోచింది కాని వసంతం రావటం లేదు !!

Monday 5 September 2011

నిరీక్షణ

పుట్టడానికి నిరీక్షణ,
పెరగటానికి నిరీక్షణ,
చావటానికి  నిరీక్షణ,
గమ్యానికి చేరువ కావాలని నిరీక్షణ..
జీవితం లో తోడు కోసం నిరీక్షణ..
ఇలా ....
క్షణ  క్షణం ఒక  నిరీక్షణ
మనిషి బ్రతికున్నంత వరకు ఆగదు  ఈ వీక్షణ !